మీరు వస్తానంటే మేము వద్దంటామా?

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు BRS ఓపెన్ ఆఫర్!

పొగడ్తలు.. విమర్శలు.. వ్యూహాత్మక అడుగులు?

చర్చల్లో ప్రముఖుల పేర్లు

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే ముచ్చట నడుస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌లోకి దూకిన ఎమ్మెల్యేలు మళ్లీ వెనక్కి వస్తారా? బీఆర్ఎస్ నిజంగానే వారికి గులాబీ కండువా కప్పడానికి ‘ఆపరేషన్ ఆకర్ష్’ మొదలుపెట్టిందా?

అనే చర్చలు విపరీతంగా సాగుతున్నాయి. అసలు తెరవెనుక ఏం జరుగుతోందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

పొగడ్తలు.. విమర్శలు.. వ్యూహాత్మక అడుగులు?

కాంగ్రెస్ పార్టీలో చేరిన కొందరు ఎమ్మెల్యేలు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత ఆజ్యం పోశాయి. ఒకప్పుడు బీఆర్ఎస్‌ను, కేసీఆర్‌ను తీవ్రంగా విమర్శించిన నేతలే.. ఇప్పుడు ఉన్నట్టుండి కేసీఆర్ పాలనను, వారి నిర్ణయాలను పొగడటం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందనే ప్రచారం సాగుతోంది. ‘పార్టీ మారినా.. మనస్సులో బీఆర్ఎస్ ఆలోచనలే ఉన్నాయా?’ అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.

చర్చల్లో ప్రముఖుల పేర్లు

ఈ తిరుగు ప్రయాణం ప్రచారంలో దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, డాక్టర్ సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలతో పాటు సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొందరు నేతలు కూడా బీఆర్ఎస్ అధినాయకత్వంతో టచ్‌లో ఉన్నారనే ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేత అయిన పోచారం శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలోనే ఈ మార్పులు చోటుచేసుకుంటాయా అనే కోణంలో విశ్లేషణలు జరుగుతున్నాయి.

కాంగ్రెస్ సైలెంట్.. కేవలం ప్రచారమేనా?

పోచారం వ్యాఖ్యలు, ఈ మార్పుల ప్రచారాలపై కాంగ్రెస్ అగ్రనేతలు, మంత్రులు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. కేవలం కొంతమంది నేతలు మాత్రమే దీనిపై వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను తమవైపు తిప్పుకోవడానికి బీఆర్ఎస్ వేసిన కౌంటర్ వ్యూహమా ఇది? లేక కేవలం ఊహాగానాలకే పరిమితమయ్యే రాజకీయ ప్రచారమా? అనేది త్వరలోనే తేలనుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం తెలంగాణ రాజకీయం మరో పెద్ద మలుపు తిరగడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *