దసరా సందర్భంగా పోటెత్తిన భక్తులు..
నూతన వాహనాలకు ప్రత్యేక పూజలు.ఈవో రాజ్‌కుమార్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు
మంథని,(తెలంగాణ నేత్రం)విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో నూతన వాహన పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నూతన వాహనాలకు పూజలు చేయించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రుద్రభట్ల జయంతి శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తీసుకొచ్చిన నూతన వాహనాలకు అర్చక బృందం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేసింది. భక్తులకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈవో రాజ్‌కుమార్, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో, కమిటీ సభ్యులు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాహన పూజలు ప్రశాంతంగా జరిగేలా అర్చక బృందం, ఆలయ సిబ్బంది సమన్వయంతో సేవలందించారు.


Leave a Reply