ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జాప్యం చేయొద్దు

పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలి: కలెక్టరేట్ ఏవో బి. ప్రకాష్

పెద్దపల్లి, అక్టోబర్ 19(తెలంగాణ నేత్రం)ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వాటిని పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం పెద్దపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు.

వృద్ధాప్యంలో బిడ్డలు పట్టించుకోవడం లేదని అర్జీ

ఎలిగేడు మండలం శివపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ చాంద్ బీ తన వృద్ధాప్యంలో కుమారులు, కుమార్తె బాగోగులు చూసుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సంక్షేమ శాఖ అధికారికి ఏవో సూచించారు.

ఖాళీ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్‌పై ఫిర్యాదు

రామగుండం మండలం గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన కొమ్మ చందు యాదవ్.. కోర్టు కేసులో ఉన్న ఇంటి నంబర్ 7-1-166/1 పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని జంగిలి రాజిరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపిస్తూ దరఖాస్తు చేశారు. దీనిపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని రామగుండం తహసీల్దార్‌కు సూచించారు.

బయో పెస్టిసైడ్‌తో పత్తి పంట దెబ్బతిందని అర్జీ

జూలపల్లి మండలం బాలరాజుపల్లి గ్రామానికి చెందిన కుంటూరి రాజయ్య తన రెండెకరాల 20 గుంటల పత్తి పంటకు ఎస్‌.కె. రెడ్డి కంపెనీకి చెందిన బయో పెస్టిసైడ్ పిచికారీ చేసిన అనంతరం పంట దెబ్బతిందని తెలిపారు. దీనిపై విచారణ జరిపించి నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారికి ఏవో సూచించారు.

ప్రజావాణి కార్యక్రమంలో పీడీ హౌసింగ్ పవన్ కుమార్, ఈ సెక్షన్ పర్యవేక్షకుడు విజయ్, సీ సెక్షన్ పర్యవేక్షకుడు కోటేశ్వర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲