మంథని పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తాం

గోదావరి పుష్కరాల కోసం భారీ ఘాట్ల ఏర్పాటు

మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో పట్టణ రూపురేఖలు మారుస్తాం: మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్

మంథని,(తెలంగాణ నేత్రం)మంథని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సాయేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మంథని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

మంథని పట్టణంలో బతుకమ్మ పండుగను ఆడపడుచులంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంగరంగ వైభవంగా జరుపుకున్నారని తెలిపారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భారీ గోదావరి ఘాట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే మంథని పట్టణ రూపురేఖలు మారనున్నాయని వెల్లడించారు.

అభివృద్ధిపై విమర్శలకు స్పందన

తమ్మచెరువు కట్ట వద్ద పగటిపూట చీకటి ఉందంటూ చేస్తున్న విమర్శలను వారు ఎద్దేవా చేశారు. మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లతో కలిసి రాత్రింబవళ్లు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో పట్టణ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

గత పదేళ్ల పాలనలో మంథని ప్రాంతాన్ని ఏ మేరకు అభివృద్ధి చేశారో ప్రతిపక్ష నాయకులు ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తమ్మచెరువు కట్ట పనులు 70 శాతం పూర్తయ్యాయని చెబుతున్న వారు, తమ పాలనలో వాటిని ఎందుకు పూర్తి చేయలేకపోయారని ప్రశ్నించారు. గత పాలనలో కాంట్రాక్టుల విషయంలో అవినీతి జరిగిందని వారు ఆరోపించారు.

చెరువుల ఆక్రమణలపై చర్యలు

రావుల చెరువు కట్ట ఆక్రమణకు గురైందన్న ఆరోపణలపై స్పందిస్తూ, ఆక్రమణలకు సంబంధించిన వివరాలు అందిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఒక్క అంగుళం భూమి ఆక్రమణకు గురైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.

యువతకు ఉపాధే లక్ష్యం

గత పాలనలో ఉపాధి హామీ అవకాశాలు కోల్పోవడం వల్ల పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని వారు విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు చిన్న పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తున్నారని, మంథని ప్రాంతంలో టాస్క్ శిక్షణ కేంద్రం ఏర్పాటు యువతకు ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

తాము ఇదే ప్రాంతంలో పుట్టి పెరిగిన వారమని, మంథని అభివృద్ధికి అవసరమైన చర్యలను చేపడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతామని చైర్మన్, వైస్ చైర్మన్ తెలిపారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్లంకి వంశీ, మారుపక నిహారిక, పెంటరి రాజు, కుర్ర లింగయ్య, జంబోజు శ్రీమతి సమ్మయ్య, ఎరుకల స్రవంతి, రమేష్‌బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి అరెల్లి కిరణ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲