సింగరేణి కార్మికులకు సొంతింటి కలను త్వరలోనే నిజం చేస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు
రామగుండం ప్రాంతాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి చూపిస్తా: ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, సింగరేణి సంస్థ సౌజన్యంతో గోదావరిఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మైదానంలో దసరా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ దంపతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినీ, టీవీ కళాకారులు, ప్రముఖ గాయకులు, సినీ నటుడు శివారెడ్డి తమ ప్రదర్శనలతో అలరించారు. అనంతరం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, తెలంగాణలో పారిశ్రామికంగా రామగుండం ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధిలో సింగరేణి కార్మికుల కృషి కీలకమని పేర్కొన్నారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు బోనస్ అందించే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. సింగరేణి కార్మికుల సొంతింటి కలను త్వరలోనే నిజం చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని స్పష్టం చేశారు.రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ, రామగుండం ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళి స్వామి, ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, సింగరేణి కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Leave a Reply