టీజీపీఎస్సీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి

అక్టోబర్ 24న అసిస్టెంట్ సైంటిస్ట్, 26న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పరీక్షలు

పెద్దపల్లి, అక్టోబర్ 19(తెలంగాణ నేత్రం)తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగ నియామకాల కోసం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పరీక్షలను అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.

అక్టోబర్ 24న అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II), అక్టోబర్ 26న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణలో జిల్లా కలెక్టర్లు కీలక బాధ్యత వహించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ప్రశ్నపత్రాల లీకేజీకి అవకాశం లేకుండా పటిష్టమైన సాంకేతిక భద్రతా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లో పోలీసు బందోబస్తు, అభ్యర్థుల తనిఖీలు పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న ఇన్విజిలేటర్‌ను నియమించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు.

పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు కనీసం గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ నిబంధనపై అభ్యర్థులకు ముందుగానే విస్తృత ప్రచారం ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు.

పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించాలని, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని ఆదేశించారు. మహిళా అభ్యర్థుల తనిఖీలకు మహిళా పోలీసులను నియమించాలని, పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ర్యాలీలు, ధర్నాలు, సభలకు అనుమతులు ఇవ్వకూడదని సూచించారు. పరీక్షల నిర్వహణలో నిబంధనలను అందరికీ సమానంగా అమలు చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీసీపీ రాంరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲