ఇందిరమ్మ ఇళ్లకు రూ.230కే సిమెంట్ బస్తా:మంత్రి పొంగులేటి

ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సిమెంట్ పరిశ్రమలు భాగస్వాములు కావాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.

మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్ ధరల తగ్గింపుపై ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. మంత్రి విజ్ఞప్తి మేరకు ఒక్కో బస్తాను రూ.230లకు ఇవ్వడానికి యాజమాన్యాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కేవలం గృహ నిర్మాణ కార్యక్రమం మాత్రమే కాదని..

పేద కుటుంబాలకు గౌరవప్రదమైన జీవితం, సామాజిక భద్రత, ఆత్మగౌరవాన్ని కల్పించే మహాయజ్ఞమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. వీటిలో ఇప్పటికే గణనీయ సంఖ్యలో 85 శాతం ఇళ్ల శ్లాబులు పూర్తయ్యాయని.. మిగిలిన 15 శాతం ఇళ్లు వివిధ నిర్మాణ దశల్లో వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

రెండో విడతలో నియోజకవర్గానికి రెండు వేల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామన్నారు. అలాగే క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొని ప్రయోగాత్మకంగా 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్స్‌కు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. నిర్మాణ పురోగతికి అనుగుణంగా విడతల వారీగా ప్రతి సోమవారం పారదర్శకంగా నిధులను విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి యాజమాన్యాలకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *