గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో రామగుండం నగరాన్ని ఆదర్శ మునిసిపల్ కార్పొరేషన్‌గా తీర్చిదిద్దుతున్నామని నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా గురువారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల పోరాటం, అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టిన సెప్టెంబర్ 17ను ప్రజా పాలనా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకుందని పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రతి డివిజన్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో గత మూడేళ్లలో సుమారు రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, రామగుండం వ్యాపార, విద్యా, వైద్య కేంద్రంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), కమిషనర్ జె. అరుణశ్రీ, కార్పొరేటర్లు రేణికుంట్ల నిర్మల, బాలసాని తిరుపతి, గట్ల రమేష్, చిదురాల నాగరాజు, ముస్తాఫా, డేవిడ్ రాజు, వడ్లూరి రవి, డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి, ఈఈ శాంతిస్వరూప్, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, నాయకులు తిప్పారపు శ్రీనివాస్, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply