సింగరేణి కార్మికులపై వేధింపులు ఆపాలి.

టీబీజీకేఎస్, బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన

సస్పెన్షన్లు, ఛార్జ్‌షీట్లు వెంటనే రద్దు చేయాలి

కార్మికుల జోలికొస్తే ఊరుకునేది లేదు: కోరుకంటి చందర్

గోదావరిఖని(తెలంగాణ నేత్రం)సింగరేణి వ్యాప్తంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్), బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనను నిరసిస్తూ ఆర్జీ-1 ఏరియాలోని జీడీకే 2, 2ఏ ఇన్‌క్లైన్ వద్ద ఈ ధర్నా నిర్వహించారు.వడ్డేపల్లి శంకర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులతో నిరసన తెలిపారు. కార్మికులపై జారీ చేసిన ఛార్జ్‌షీట్లు, సస్పెన్షన్లు, డిస్మిసల్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.సింగరేణి రికార్డుల్లో పెండింగ్‌లో ఉన్న మారుపేర్ల సమస్యను పరిష్కరించాలని, కారుణ్య, డిపెండెంట్ ఉద్యోగాల నియామకాలను పునరుద్ధరించాలని కోరారు. ఖాళీల ఆధారంగా అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు కల్పించాలని, 60 ఏళ్లు దాటిన వారికి బకాయిలతో కూడిన పింఛన్ మంజూరు చేయడంతో పాటు క్రమం తప్పకుండా మెడికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.కార్మికులను ప్రభుత్వం మోసం చేసిందిఈ సందర్భంగా రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు గడుస్తున్నా కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన 250 గజాల ఇంటి స్థలాలు, 100 శాతం ఇన్‌వాలిడేషన్ ఉద్యోగాలు, ఇన్‌కమ్ ట్యాక్స్ మినహాయింపు వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 19 వేల మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు మెడికల్ కాలేజీల్లో కార్మికుల పిల్లలకు 5 శాతం కోటా కల్పించామని చందర్ పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా కార్మికులపై సస్పెన్షన్లు, ఛార్జ్‌షీట్ల పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.కార్మికుల హక్కులను కాలరాస్తే ఊరుకునేది లేదని, అవసరమైతే పోరాటాలను మరింత ఉధృతం చేస్తామని కోరుకంటి చందర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాదాసి రామ్మూర్తి, నూనె కొమరయ్య, ఉప్పులేటి తిరుపతి, మీస రాజు, దూత శేషగిరి, మేకల సమ్మయ్య, మూల విజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *