తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త రికార్డు!
తెలంగాణ రాజకీయాల్లో గత కొద్దిరోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న కొండా సురేఖ ఎపిసోడ్‌కు ఎట్టకేలకు ఎండ్ కార్డ్ పడింది. వివాదాస్పద పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.సురేఖను మంత్రి వర్గం నుంచి తక్షణమే తొలగించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి పంపిన లేఖ లోక్ భవన్‌కు చేరింది. ఈ ప్రతిపాదనపై గవర్నర్ అధికారిక నిర్ణయం తీసుకోవడమే తరువాయిగా మిగిలింది.తెలంగాణ చరిత్రలో సరికొత్త రికార్డు:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన రికార్డు నమోదు కాబోతోంది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన మూడో మంత్రిగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి మంత్రిగా కొండా సురేఖ నిలవనున్నారు. అంతేకాకుండా, రాష్ట్రంలో బర్తరఫ్ అయిన తొలి మహిళా మంత్రిగా కూడా కొండా సురేఖ చరిత్రకెక్కనున్నారు.గతంలో బర్తరఫ్ అయిన మంత్రులు వీరే:తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కేబినెట్ నుంచి మంత్రులను తొలగించడం ఇది మూడోసారి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత బీఆర్ఎస్ ఫస్ట్ టర్మ్ ప్రభుత్వంలో డాక్టర్ తాటికొండ రాజయ్యను 2015 లో నాటి సీఎం కేసీఆర్ బర్తరఫ్ చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొలి ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న రాజయ్యపై అవినీతి ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ రెండో దఫా ప్రభుత్వంలో మే 2021లో ఈటల రాజేందర్‌పై కూడా కేసీఆర్ బర్తరఫ్ చేశారు. వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉండగా ఈటలపై అసైన్డ్ భూముల ఆక్రమణ ఆరోపణలు రావడంతో ఆయనను కూడా కేబినెట్ నుంచి తొలగించారు. అయితే ఇప్పటి వరకు బర్తరఫ్ అయిన ముగ్గురిలో రాజయ్య, ఈటల రాజేందర్ ఇద్దరు వైద్యారోగ్యశాఖ మంత్రులుగా పని చేస్తుండగా చర్యలకు గురికాగా కొండా సురేఖ మాత్రం దేవాదాయ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తూ వేటుకు గురయ్యారు.


Leave a Reply