ప్రైవేట్ భూముల సమస్యలను 48 గంటల్లో పరిష్కరించాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, ఆగస్టు 31(తెలంగాణ నేత్రం)
22ఏ నిషేధిత భూములకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తి ఆధారాలు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములుతో కలిసి 22ఏ నిషేధిత భూముల జాబితాపై రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వస్తున్న ఫిర్యాదులు, భూముల రికార్డుల పరిశీలన, 22ఏ జాబితాలో భూములను చేర్చడం, తొలగించడం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
22ఏ జాబితాలో చేర్చే ప్రతి భూమికి స్పష్టమైన ఆధారాలు ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఏదైనా ప్రైవేట్ భూమి పొరపాటున 22ఏ నిషేధిత జాబితాలో నమోదైనట్లు నిర్ధారణ అయితే, సర్వే నంబర్ వారీగా డిలీటెడ్ లిస్ట్ రూపొందించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు. భూములను జాబితాలో చేర్చే సమయంలో అనుసరించే విధానాన్నే తొలగింపు ప్రక్రియలోనూ పాటించాలని ఆదేశించారు.
తొలగించే ప్రతి సర్వే నంబర్‌కు నిర్దిష్ట కారణాలు, స్పష్టమైన రిమార్క్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 22ఏ భూముల పరిశీలన, తొలగింపు ప్రక్రియకు ఒకే ఫార్మాట్‌ను రూపొందించాలని సూచించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 22ఏ సమస్యలను పారదర్శకంగా, వేగంగా పరిష్కరించాలని, నిజమైన ప్రైవేట్ భూములకు సంబంధించిన సమస్యలను 48 గంటల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడవద్దని స్పష్టం చేశారు.
ఫిర్యాదులపై అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సమావేశంలో ఆర్డీఓ గంగయ్య, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply