- రాబోయే ఎన్నికల్లో మా పనితీరుకు ఇదే ప్రామాణికం : బేతుపల్లి సభలో మంత్రి పొంగులేటి ప్రకటన
- అక్రమాలకు అడ్డుకట్ట.. ప్రతి అంగుళం భూమి సరిగ్గా కొలిచి టైటిల్స్ ఇస్తాం
- ‘22A’ పేరిట దోచుకున్న ఆస్తులను వదిలిపెట్టేది లేదు.. ‘సిట్’ ద్వారా ముక్కు పిండి వసూలు చేస్తాం


సత్తుపల్లి : “ఈ ప్రజా ప్రభుత్వంలో మేము ప్రవేశపెట్టిన ‘భూ భారతి’ చట్టం అమలే రాబోయే ఎన్నికల్లో మా ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమ్. చట్టం తెచ్చేనాడే ఈ మాట చెప్పాం.. ఈ రోజుకీ అదే మాట మీద నిలబడుతున్నాం. ప్రజల తీర్పు దగ్గరకు పోయినప్పుడు మీకు ఫలితాలు ఏంటో గతంలో చూపించాం.. భవిష్యత్తులోనూ అవే ఫలితాలు పునరావృతం అవుతాయి” అని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని బేతుపల్లి రెవెన్యూ గ్రామంలో భూ రీ సర్వే రైతులతో గురువారం నిర్వహించిన ముఖాముఖి – అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
- భూమిపై రైతన్నకు ఉన్నది ఎమోషనల్ బాండింగ్…
“భూమి అనేది కేవలం మన్ను కాదు.. అది రైతన్నకు గుండెకాయ లాంటి ఎమోషనల్ బాండ్. గత ప్రభుత్వంలో ధరణి పేరుతో తీవ్ర అవకతవకలు జరిగాయి. సాగులో ఉన్న పేద రైతుకు పాస్ పుస్తకాలు రాకపోగా, సెంట్ భూమి లేని భోగస్ వ్యక్తులకు పదుల ఎకరాల రికార్డులు సృష్టించి బ్యాంకులు, రైతుబంధు సొమ్ము దోచుకున్నారు” అని మంత్రి ధ్వజమెత్తారు. నాగార్జునసాగర్ పైలట్ ప్రాజెక్టులో సర్వే చేయగా వేలాది ఎకరాల భోగస్ భూములు బయటపడ్డాయని, అందుకే ఇప్పుడు బేతుపల్లితో పాటు రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ రోవర్ టెక్నాలజీతో సర్వే చేపడుతున్నామని వివరించారు. - అబాదీ ఆస్తులకు పక్కా సర్వే – టైటిల్స్ పంపిణీ…
ప్రతి జిల్లాలో తొలివిడతగా 70 గ్రామాలను ఎంపిక చేసి, రాబోయే ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములతో పాటు నివాస ప్రాంతాల (అబాదీ) భూములను కోఆర్డినేట్స్, మ్యాప్‌లతో సహా సర్వే చేస్తామన్నారు. ప్రతి రైతుకూ డిజిటల్ కోఆర్డినేషన్ మ్యాప్‌తో కూడిన పక్కా హక్కుల టైటిల్ డీడ్ ఇస్తామని పేర్కొన్నారు. - 22ఏ అక్రమాలపై ‘సిట్’ బాణం…
ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “గతంలో చట్టం తెచ్చి 3 ఏళ్లు రూల్స్ చేయలేని వాళ్లు.. ఈ రోజు మూడో నెలలోనే నిబంధనలు తెచ్చిన ప్రజా ప్రభుత్వాన్ని చూసి కారుకూతలు కూస్తున్నారు. 22ఏ ప్రొహిబిటెడ్ లిస్ట్ పేరుతో అమాయక ప్రజలను కవచంగా పెట్టుకుని, తెరచాటున వేలాది ఎకరాల అక్రమ ఆస్తులను రెగ్యులరైజ్ చేసుకోవాలని పగటి కలలు కంటున్నారు. ఈ ప్రభుత్వంలో మీ పప్పులు ఉడకవు. ప్రజల సొమ్ము తింటే వంటపట్టదు. ఇందుకోసం ఇప్పటికే ‘సిట్’ వేశాం.. ముక్కు పిండి వసూలు చేస్తాం” అని హెచ్చరించారు. - రాష్ట్రమంతటా స్వయంగా నేనే వస్తా!…
కరీంనగర్, నిజామాబాద్ సహా ప్రతి జిల్లాకూ రెవెన్యూ మంత్రిగా స్వయంగా వెళ్లి రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడి, అక్రాస్ ది టేబుల్ సమస్యలను పరిష్కరిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, రైతు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Leave a Reply