కేంద్ర అనుమతి నిరాకరణతో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు

హైదరాబాద్: కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం అమెరికా పర్యటనను రద్దు చేసుకుంది. UK, అమెరికా పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న ప్రతినిధి బృందానికి అమెరికా పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

విధివిధానాలు, ప్రోటోకాల్ ప్రకారం సీఎం నేతృత్వంలోని ప్రతినిధి బృందం UK, అమెరికా పర్యటనలకు కేంద్ర అనుమతి కోరినట్లు అధికారులు తెలిపారు. తొలుత UK పర్యటనకు మాత్రమే అనుమతి లభించగా, ప్రతినిధి బృందం UK చేరుకున్న అనంతరం అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించినట్లు పేర్కొన్నారు.

అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విస్మయం వ్యక్తం చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే కేంద్ర నిర్ణయాన్ని గౌరవిస్తూ బోస్టన్ పర్యటనను రద్దు చేసి లండన్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రావాలని ఆయన నిర్ణయించుకున్నారు.

విద్యా సంస్థలతో భాగస్వామ్యాలే ప్రధాన లక్ష్యం

ప్రపంచంలోని ప్రముఖ విద్యాసంస్థలను తెలంగాణకు, హైదరాబాద్‌కు తీసుకురావడం, విద్య, నైపుణ్యాలు, శిక్షణ రంగాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించడం అమెరికా పర్యటన ప్రధాన ఉద్దేశమని సీఎం తెలిపారు. ఇప్పటికే వివిధ విశ్వవిద్యాలయాలతో జరిగిన చర్చలను అధికారులు కొనసాగించాలని, అవసరమైన అవగాహన ఒప్పందాలు, భాగస్వామ్య ఒప్పందాలను పూర్తి చేయాలని ఆదేశించారు.

“దేశ నిర్మాణం, యువత భవిష్యత్తు విషయంలో రాజకీయాలకు, ఎన్నికలకు అతీతంగా ఆలోచించాలి” అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

హైదరాబాద్‌ను నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దుతాం

హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని సీఎం తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ వంటి సంస్థలతో పాటు ఐఐటీ, ఐఎస్‌బీ, ఐఐఐటీ, నల్సార్ వంటి ప్రముఖ విద్యాసంస్థలు నగరాన్ని మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.

ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థల నుంచి విద్య, సర్టిఫికేషన్ పొందే అవకాశాలను హైదరాబాద్‌లోనే అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

UKలో కొనసాగనున్న కీలక సమావేశాలు

షెడ్యూల్ ప్రకారం UK పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ లండన్ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. అలాగే ప్రముఖ క్రీడా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి రంగ నాయకులతో చర్చలు జరిపి తెలంగాణతో భాగస్వామ్యాలను ఖరారు చేసేందుకు ప్రయత్నించనున్నారు.

హైదరాబాద్‌ను ప్రపంచంలోని అగ్రశ్రేణి నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దడంతో పాటు, ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్య సంస్థలను నగరానికి ఆకర్షించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *