విషప్రచారాలను తిప్పికొట్టాలి…
మంత్రి పొంగులేటి
కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, ఓట్ల తొలగింపు పేరిట కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు కుట్రపూరిత రాజకీయాలకు ఒడిగడుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ధ్వజమెత్తారు.
ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పీఏసీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కో ఇన్ చార్జి సచిన్ సావంత్ హాజరయ్యారు. స్థానిక పార్లమెంట్ సభ్యులు రఘురామ్ రెడ్డి, ఖమ్మం జిల్లా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఓటర్ల తొలగింపుపై సమరశంఖం…
ఎస్ఐఆర్ అనే ప్రక్రియను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీతో కలిసి భాజపా కుట్రలు చేస్తోందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల ఓట్లే లక్ష్యంగా సుమారు 67 నుంచి 68 లక్షల ఓట్లను తొలగించేందుకు శ్రీకారం చుట్టడమే కాకుండా, మరో 70 లక్షల ఓట్లను గాలిలో పెట్టి ఓటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు రాబోయే 4-5 రోజుల్లో బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
విషప్రచారాలను తిప్పికొట్టాలి…
రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కనబెట్టి, ప్రతిపక్షాలు నెలకు రూ.4 నుంచి 5 కోట్లు ఖర్చు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని శ్రేణులంతా సమర్థవంతంగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధిక స్థానాలను గెలుచుకుని, రాహుల్ గాంధీని దేశ ప్రధానిని చేయడమే కాంగ్రెస్ శ్రేణుల ప్రధాన లక్ష్యమని పొంగులేటి స్పష్టం చేశారు.


Leave a Reply