విద్యార్థి సేన అధ్యక్షులు టి.కె. శివప్రసాద్ డిమాండ్
‘శక్తి’ స్కీమ్‌లో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడానికి సంబంధించిన జీవో-97ను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి సేన అధ్యక్షులు టి.కె. శివప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. షాద్‌నగర్ విద్యార్థి సేన కమిటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో కలిసి నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టి.కె. శివప్రసాద్ మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండేలా దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను యథాతథంగా బలోపేతం చేయకుండా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావడం ఎవరి ప్రయోజనం కోసం అని ప్రశ్నించారు. పాలిటెక్నిక్ కళాశాలల విలీన నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు. గత రెండు వారాలుగా వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని, విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం సరికాదన్నారు. తెలంగాణలో సుమారు 60 పాలిటెక్నిక్ కళాశాలలు పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉపాధికి ఉపయోగపడే వివిధ సాంకేతిక కోర్సులను అందిస్తున్నాయని తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని, కళాశాలల మౌలిక వసతులు, ల్యాబ్‌లు, హాస్టళ్లు, నిధులను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.
పాలిటెక్నిక్ కళాశాలలకు సంబంధించిన విలువైన భూములపై ప్రభుత్వం దృష్టి సారించిందనే అనుమానాలు విద్యార్థుల్లో ఉన్నాయని పేర్కొంటూ, ప్రభుత్వం వెంటనే జీవో-97ను ఉపసంహరించుకుని పాత విధానంలోనే పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థులతో పాటు విద్యార్థి సేన రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రిషబ్ జైన్, హైదరాబాద్ అధ్యక్షులు చింతల పవన్, షాద్‌నగర్ శాఖ అధ్యక్షులు నర్సింహా ముదిరాజ్, పరమేశ్వర్, బాలు, రాజు, రాంమోహన్ రెడ్డి, చింటూ తదితరులు పాల్గొన్నారు..


Leave a Reply