ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారంతో అల్పాహారం

గంటలో 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీల తయారీ సామర్థ్యం
మంథని, ఆగస్టు 24: పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచేందుకు అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.మంథనిలో సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఆధునిక సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కిచెన్‌లో తయారు చేసిన అల్పాహారాన్ని విద్యార్థులతో కలిసి స్వీకరించి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్గదర్శకత్వంలో తొలుత కొడంగల్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. ఈ పథకం అమలుతో కొడంగల్ నియోజకవర్గంలో విద్యార్థుల హాజరు 21 శాతం పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం కొడంగల్‌తో పాటు మధిరలోనూ ఈ పథకం అమలవుతోందన్నారు.మంథనిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కిచెన్‌లో ఆధునిక యంత్రాల సాయంతో గంటకు 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందని మంత్రి తెలిపారు. విద్యార్థులకు ప్రతిరోజూ విభిన్న రకాల అల్పాహారం అందించేలా ప్రత్యేక మెనూను రూపొందించామని, వారానికి కనీసం మూడు సార్లు పాలు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 2011లో ఆసుపత్రుల్లోని రోగుల సహాయకులకు ఆహారం అందించే కార్యక్రమం ప్రారంభమైందని మంత్రి గుర్తుచేశారు. ‘పది మైళ్ల పరిధిలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు’ అనే ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద సందేశం తెలంగాణ ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలిచిందన్నారు.విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంవిద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఆహారం లేకుండానే పాఠశాలకు హాజరైన పరిస్థితి ఉండేదని ఓ విద్యార్థిని తన కష్టాలను మంత్రికి వివరించింది. ఇలాంటి పరిస్థితులను విద్యార్థులు ఇకపై ఎదుర్కోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్‌బాబు అన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా విద్యార్థులు మంచి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై మరింత ఏకాగ్రత సాధిస్తారని పేర్కొన్నారు.విద్యకు పెద్దపీట: కలెక్టర్జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మంత్రి సూచనల మేరకు జిల్లాలో విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అధ్యయనాల ప్రకారం విద్యాశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచిందని చెప్పారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కొత్త ఉపాధ్యాయుల నియామకంతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య ఉచితంగా అందుతున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కలెక్టర్ సూచించారు.కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆర్జీ-3 జీఎం, తహసీల్దార్ ఆరిపోద్దిన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply