కాంగ్రెస్‌లో ముదురుతున్న అసమ్మతి..

క్రమశిక్షణకు సవాల్

ఎవరికివారే సీనియర్లమనే భావన..

పార్టీకి చేటు చేస్తున్న నేతల ప్రకటనలు

అధికార కాంగ్రెస్పార్టీలో ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి. నాయకుల్లో అసహనం కట్టలు తెంచుకుంటున్నది. పవర్‌లోకి వచ్చామనే కంటే తమకు లాభం ఏమి జరగలేదని, తమ తర్వాత వచ్చిన వారికి పదవులు, ప్రాధాన్యత ఇస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైనా పదవులు రాలేదని, గుర్తింపు ఇవ్వడం లేదని, పనులు కావడం లేదని, భవిష్యత్‌పై భరోసా లేదంటూ ఇలా ఒక్కొక్కరూ ఒక్కో సమస్య ఉందంటూ మీడియాకు ఎక్కుతున్నారు. దశాబ్దకాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పార్టీకి ప్రతిపక్షం కంటే సొంత నేతలతోనే సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. పార్టీకి ప్రభుత్వానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సీనియర్నేతలు ఇష్టారీతిన, క్రమశిక్షణ ఉల్లంఘించి బహిరంగంగా మాట్లాడినా వారిని పిలిపించి క్లాస్ పీకడంతో పాటు ఆ సమస్యను పరిష్కరించడం, రాజీ కుదర్చడం, వారికి నచ్చచెప్పే నాయకుడు లేకుండా పోయారని పార్టీలో ఆందోళన వ్యక్తమవుతోంది. పెద్దరికం చేసే నేతలు లేకపోవడం, ఈ పనిచేయాల్సిన ఏఐసీసీ పెద్దలు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై అంతగా దృష్టి పెట్టకపోవడంతో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని చర్చ జరుగుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *