మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్
రామగిరి: భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్‌రోడ్‌లోని పెట్రోల్ పంప్ వద్ద ఉన్న మంథని బ్లాక్ కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ రొడ్డ బాపన్న పటేల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ తొట్ల తిరుపతి యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి తిరుపతి యాదవ్ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి, ఆధునిక భారత నిర్మాణం కోసం రాజీవ్ గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువతకు రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించడంతో పాటు, సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ప్రపంచస్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినదని పేర్కొన్నారు.పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, యువతకు ఓటు హక్కు వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించడం, ఐటీ రంగానికి పునాదులు వేయడం వంటి కీలక నిర్ణయాలు రాజీవ్ గాంధీ దూరదృష్టికి నిదర్శనమని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో ముందుకు సాగడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Leave a Reply