మంథని, ఆగస్టు 19: మంథని నియోజకవర్గంలో రూ.800 కోట్లకు పైగా చేపట్టిన రహదారి, మౌలిక వసతుల అభివృద్ధి పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మంథనిలో బుధవారం మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
గంగాపురి వద్ద రూ.20 కోట్లతో NAC స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, మంథని–రామగుండం నాలుగు లేన్ల రహదారి విస్తరణ, పట్టణంలో బీటీ, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. మంథని రహదారి పనులపై ప్రతి 15 రోజులకు సమీక్ష నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. కమాన్‌పూర్–మంథని నాలుగు లేన్ల రహదారికి రూ.200 కోట్లు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తీసుకుంటామని వెల్లడించారు.
NAC స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను 6–8 నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చి యువత, మహిళలకు నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు. రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధితో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ మంథని ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురావడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, యువతకు నైపుణ్య శిక్షణ కోసం ATC, NAC కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తక్కువ వర్షపాతం నేపథ్యంలో రైతులు నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రత్యామ్నాయ పంటలు, ఆయిల్‌పామ్ సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు.
కార్యక్రమంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రులు వైకుంఠ రథాలను ప్రారంభించారు.


Leave a Reply