తెలంగాణ పై అల్పపీడన ద్రోణి ప్రభావం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్షం హెచ్చరికలు జారీ చేసింది…!

రాష్ట్రంలో వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడిందని చెప్పారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. భారత వాతావరణ శాఖ హైదరాబాద్‌ కేంద్రం విడుదల చేసిన తాజా బులెటిన్‌లో ఈ వివరాలను వెల్లడించారు.

వాయవ్య బంగాళాఖాతం నుంచి పశ్చిమబెంగాల్‌ – ఉత్తర ఒడిశా తీరాలపై ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వరకు రుతుపవన ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉండటం వల్ల తూర్పు, మధ్య భారతంతో పాటు తెలంగాణలోనూ వర్షాలు కురిసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావం వల్ల ఈ కాలంలో రుతుపవనాలు మరింత చురుగ్గా మారుతుంటాయని చెప్పారు.

అయితే, వర్షాలతో పాటు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు, హోర్డింగులు, నిర్మాణ ప్రాంతాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉరుములు, మెరుపుల సమయంలో బహిరంగ ప్రదేశాలలో ఉండకపోవడం శ్రేయస్కరమని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *