విద్యార్థుల కోసం పోరాడిన ఎస్పీకే సాగర్‌ను అదుపులోకి తీసుకోవడం ఖండనీయం

జయశంకర్ భూపాలపల్లి, ఆగస్టు 18: పాలిటెక్నిక్‌ విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులకు సంఘీభావం తెలిపి, వారి తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వరంగల్ పార్లమెంట్‌ కంటెస్టెడ్‌ ఎంపీ అభ్యర్థి, నేషనల్‌ కన్జ్యూమర్‌ రైట్స్‌ కమిషన్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ ఎస్పీకే సాగర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వారి తరఫున ప్రశ్నిస్తున్న వారిని పోలీసులతో అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని సాగర్‌ అన్నారు. అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా గొంతులను అణచలేరని పేర్కొన్నారు.

పాలిటెక్నిక్‌ విద్యార్థులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్‌కు వివరించి వినతిపత్రం అందించేందుకు వచ్చిన సమయంలో వారిని కలుసుకుని సమస్యలు వినేందుకు కలెక్టర్‌ బయటకు రాకపోవడం బాధాకరమన్నారు. “జిల్లా కలెక్టర్‌ విద్యార్థులు, ప్రజల సమస్యలు వినడానికి ఉన్నారా? లేక రాజకీయ నాయకుల కోసం మాత్రమే ఉన్నారా?” అని ప్రశ్నించారు.

విద్యార్థులపై పోలీసులు బలప్రయోగం చేయడం, వారిని బలవంతంగా తరలించడం, విద్యార్థుల తరఫున ప్రశ్నించిన వారిని అదుపులోకి తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలాడవద్దని, పోలీసు బలంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తే మరింత బలంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తామని ఎస్పీకే సాగర్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థులతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *