22ఏ జాబితా వెనుక కుట్ర దాగి ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ అన్నారు. 22ఏ భూములపై సమగ్ర విచారణ చేస్తామని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. 22ఏ నిషేధిత భూముల జాబితాలో చోటుచేసుకున్న లోసుగులపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తుందని మంత్రి తెలిపారు. యాదగిరిగుట్టలో రూ.42,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని నాలుగు నెలల క్రితమే సీఎంకు చెప్పానని తెలిపారు. కొందరు అధికారులు ఉద్దేశపూర్వకంగానే చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
దరఖాస్తులు, డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, పొరపాటు జరిగిందా.. కావాలనే చేశారా.. పొలంలోనే విచారిస్తామన్నారు. 30% కమిషన్ల వ్యవహారం కూడా దర్యాప్తులో బయటపడుతుందన్నారు. సీఎం అమెరికా పర్యటన తర్వాత దీనిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. నిషేధిత జాబితాలో భూములు ఎలా చేరాయి? వాటి వివరాల్లో మార్పులు, చేర్పులు ఎలా జరిగాయి? అనే అంశాలను పరిశీలిస్తామన్నారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా, ఎంతటి వారైనా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. 22ఏ జాబితా వ్యవహారంపై వాస్తవాలను ప్రజలకు వెల్లడిస్తామని చెప్పారు. విచారణలో అక్రమాలు బయటపడితే బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.


Leave a Reply