బహుజనుల హక్కుల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఇవాళ నగరంలో ట్యాంక్‌బండ్‌పై నూతనంగా ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి..
పలువురు మంత్రులు, బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ట్యాంక్‌బండ్‌కు వచ్చే ప్రతి పర్యాటకుడికి కనిపించేలా ఈ విగ్రహ ఏర్పాటు స్థలాన్ని తానే స్వయంగా ఎంపిక చేశానని తెలిపారు. విగ్రహ ప్రాశస్త్యం కోసం అక్కడే ఉన్న టూరిజం కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయించామని, అమరవీరుల స్తూపానికి ఉన్నంత ప్రాధాన్యత పాపన్న గౌడ్ విగ్రహానికి ఉంటుందని చెప్పారు.
సామాజిక న్యాయం – బహుజన ఆత్మగౌరవం..
సర్వాయి పాపన్న వీరగాథను లండన్‌లోని బ్రిటీష్ లైబ్రరీలో సైతం భద్రపరిచారని సీఎం గుర్తుచేశారు. బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన ఈ వీరుడి విగ్రహాన్ని నెలకొల్పాలని గీత కార్మికులు ఎంతో తాపత్రయపడ్డారని, తమ ప్రజాపాలనలో సామాజిక న్యాయం, సమాన అవకాశాలకు పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు.
కుల వృత్తులకు ఆసరా..
రాష్ట్రంలో నేత, గీత కార్మికులకు పెన్షన్లు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నా ఈత, తాటి చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. కుల వృత్తులను గౌరవిస్తూనే పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, పిల్లల చదువు కోసం ఎన్ని వందల కోట్లయినా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు
బావ, బావమరిది అబద్ధపు ప్రచారం..
తెలంగాణ చరిత్రలోనే బీసీల జనాభా లెక్కలు తేల్చి సామాజిక న్యాయం అందించిన తొలి ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పాలకులు చేసిన వేల కోట్ల అప్పులు ఈనాడు రాష్ట్రానికి పెద్ద ముప్పుగా మారాయని, ఆ అప్పులకు నిరంతరం వడ్డీలు చెల్లిస్తూనే తమ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న బావబావమరుదులు కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, రాష్ట్రంలో కరవు రావాలని కోరుకుంటూ తమిళనాడు నుంచి అఘోరాలను రప్పించి చేతబడులు చేయించారని సంచలన ఆరోపణలు చేశారు. సాధారణంగా ఊళ్లలో చేతబడులు చేసేవారిని చెట్లకు కట్టేసి కొడతారని దుయ్యబట్టిన ఆయన, ప్రజలు కష్టపడి తెచ్చుకున్న ఈ ‘ప్రజాపాలన’ను కాపాడుకోవాలని, మళ్లీ పాత దొరల పాలన రావడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని పిలుపునిచ్చారు.
కేసీఆర్ పాలనపై సెటైర్లు:
గత బిఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘నాడు గొర్రెలు, బర్రెలు, చేపలు పంపిణీ చేసి.. రాజ్యం వాళ్లు ఏలుతూ, మనల్ని కుల వృత్తులకే పరిమితం చేయాలని చూశారు’ అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ సీఎం అయితే ఆయన కొడుకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, అల్లుడు హరీశ్ రావు మంత్రి అయ్యారని.. అదే రేవంత్ సీఎం అయితే బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్, సీతక్క, వాకిటి శ్రీహరి మంత్రులయ్యారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ, చాకలి ఐలమ్మ మనుమరాలికి కీలక పదవులు ఇచ్చి ఉద్యమకారులను గౌరవించామని తెలిపారు. రాబోయే డీలిమిటేషన్ తర్వాత 117 సీట్లతో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


Leave a Reply